No helmet, No fuel : నో హెల్మెట్, నో ఫ్యూయల్.. ఏ రాష్ట్రంలోనో తెలుసా
యూపీలో కొత్త విధానం;
ద్విచక్ర వాహనాల ప్రమాదాలు తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి ఇంధనం పోయొద్దని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 75 జిల్లాల కలెక్టర్లకు రవాణాశాఖ కమిషనర్ బ్రజేష్ నారాయణ సింగ్ లేఖలు పంపారు. వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించి ఉండాలని పేర్కొన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పెట్రోల్ బంకుల బయట ‘నో హెల్మెట్, నో ఫ్యూయెల్’బోర్డులను ప్రదర్శించాలని సూచించారు.
ద్విచక్ర వాహన ప్రమాదాల్లో బాధితులు హెల్మెట్ ధరించడం లేదన్న గణాంకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలను కాపాడటం, రోడ్డు భద్రతను నిర్ధారించడమే రవాణా శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో 2019లో ప్రవేశపెట్టినా అమలులో నిర్లక్ష్యం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఆదేశాల అమలుపై పర్యవేక్షణ అవసరమని, దీనికోసం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా దాదాపు 26వేల మంది చనిపోతున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే వీరిలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల రవాణాశాఖ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు పేపట్టాలని ఆదేశించారు.
ద్విచక్ర వాహనాలను నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ లేకపోయినా పెట్రోల్ బంకుల్లో పెట్రోలు పోయొద్దని నిర్వాహకులను ఆదేశిస్తూ రవాణా కమిషనర్ బ్రజేశ్ నారాయణ్ సింగ్ జనవరి 8న అధికారిక లేఖ జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల కలెక్టర్లకు ఈ లేఖను పంపారు.
ద్విచక్ర వాహనదారులు చాలా మంది హెల్మెట్లు ధరించడం లేదని తెలుపుతున్న డేటాను గుర్తు చేస్తూ ఈ లేఖను రాయడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు భద్రతా చర్యల సమీక్ష సందర్భంగా ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశాలను కూడా అందులో పేర్కొన్నారు.