Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ దర్శన వేళల్లో మార్పులు
కుంభమేళా ఎఫెక్ట్;
ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం హిందూ భక్తులతో కిటకిటలాడుతున్నది. మహాకుంభ్‌లో పుణ్యస్నానాల కోసం వెళ్తున్న ప్రజలు.. అయోధ్య, కాశీ విశ్వనాథ్ ఆలయాలను కూడా దర్శించుకుంటున్నారు. అయితే ప్రతి రోజు లక్షలాది సంఖ్యలో ఈ రెండు ఆలయాలను భక్తులు సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని కొత్తగా నిర్మించిన రామాలయ దర్శన వేళల్లో మార్పులు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు దీనిపై ప్రకటన చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంచనున్నట్లు ఆలయ ట్రస్టు పేర్కొన్నది. మొన్నటి వరకు ఆలయాన్ని ఉదయం 7 గంటలకు తెరిచేవారు. ఇప్పుడు ఓ గంట ముందు సాధారణ ప్రజల దర్శనం కోసం తెరుస్తున్నారు.
దర్శన సమయంలో మార్పులతో పాటు హారతి షెడ్యూల్‌ను కూడా మార్చారు. మొన్నటి వరకు మంగళహారతి ఉదయం 4.30 నిమిషాలకు జరిగేది. ఇప్పుడు మంగళ హారతిని ఉదయం 4 గంటలకే నిర్వహించనున్నారు. అయితే హారతి కోసం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 15 రోజుల ముందే ఆ టికెట్లు ఇస్తారు. ఉదయం 4 గంటల హారతి తర్వాత ఆలయాన్ని కొంత సేపు మూసివేస్తారు. ఆ తర్వాత ఉదయం ఆరు గంటలకు శ్రింగార హారతి ఇస్తారు. ఆ హారతితో సాధారణ ప్రజల దర్శనం కోసం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.
రామ్‌లల్లాకు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భోగ్‌ను సమర్పించనున్నట్లు ఆలయ ట్రస్టు పేర్కొన్నది. అయితే ఆ సమయంలో భక్తలను దర్శనం కోసం అనుమతిస్తారు. రాత్రి ఏడు గంటలకు సంధ్యా హారతి ఇవ్వనున్నారు. ఆ టైంలో 15 నిమిషాల పాటు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఇక ఆ రోజుకు సంబంధించిన చివరి హారతి రాత్రి 10 గంటలకు నిర్వహిస్తారు. శయన హారతి మొన్నటి వరకు రాత్రి 9.30 నిమిషాలకు ఉండేది. శయన హారతి ముగిసిన తర్వాత ఆ రాత్రికి ఆలయాన్ని మూసివేస్తారు.