Sudhanshu Mani: వందేభారత్‌లో లోపాలున్నాయి ..రైలు రూపశిల్పి సుధాంశుమణి
తక్కువ ఆక్యుపెన్సీ, నాణ్యత లేని పరికరాలపై అసంతృప్తి
భారత తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) మాజీ జనరల్ మేనేజర్ సుధాంశు మణి, ఆ రైలులో తొలిసారి సాధారణ వ్యక్తిలా ప్రయాణించారు. రైలు పట్టాలెక్కిన ఏడేళ్ల తర్వాత లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణించిన ఆయన, తనకు మిశ్రమ అనుభవం ఎదురైనట్లు తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
రైలు బయటి నుంచి చూడటానికి అద్భుతంగా ఉందని, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ శుభ్రంగా, ఇంటీరియర్ ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించారు. సీట్లు ప్రోటోటైప్ కంటే సౌకర్యవంతంగా ఉన్నాయని, ఆహారం కూడా పరిశుభ్రంగా ఉందని తెలిపారు. రైలు ‘యాక్సిలరేషన్’ ఇప్పటికీ అతిపెద్ద బలమని కొనియాడారు.
అదే సమయంలో కొన్ని లోపాలను కూడా ఆయన ఎత్తిచూపారు. కోచ్ ఫ్లోర్‌పై రెడ్ కార్పెట్ అనవసరమని అభిప్రాయపడ్డారు. టాయిలెట్లలో కుళాయిల వంటి పరికరాల నాణ్యత చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణంలో సౌకర్యం ప్రోటోటైప్‌తో పోలిస్తే ఏమాత్రం మెరుగుపడలేదని అన్నారు.
ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 25 శాతం, చైర్ కార్‌లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉందని తెలిపారు. స్లీపర్ వెర్షన్ లేకుండా కేవలం పగటిపూట నడిచే రైళ్లలో ఈ సమస్య వస్తుందని తాము ముందే ఊహించామన్నారు. వందేభారత్ స్లీపర్ వెర్షన్‌ను తీసుకురావడంలో రైల్వే శాఖ చేస్తున్న జాప్యాన్ని ఆయన విమర్శించారు. 2018లో ఐసీఎఫ్ జీఎంగా పదవీ విరమణ చేసిన సుధాంశుమణి 'ట్రైన్ 18' పేరుతో వందేభారత్ ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేసిన బృందానికి నేతృత్వం వహించారు.