Pope Francis: మరణానంతరం పోప్ ఫ్రాన్సిస్ తొలి ఫొటో రిలీజ్ చేసిన వాటికన్
అంత్యక్రియలకు ట్రంప్;
క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. స్ట్రోక్‌తో పాటు హృద్రోగ సంబంధిత సమస్య వల్ల పోప్ ఫ్రాన్సిస్ ప్రాణాలు విడిచినట్లు వాటికన్ డాక్టర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరణానంతరం పోప్ ఫ్రాన్సిస్ తొలి ఫొటోను వాటికన్ అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. ఓపెన్ శవపేటికలో పోప్ ఫ్రాన్సిస్ పడుకుని ఉండగా.. వాటికన్ విదేశాంగ కార్యదర్శి ప్రార్థనలు చేస్తూ కనిపించారు. మరోవైపు పోప్ అంత్యక్రియలకు సన్నాహకాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం, ఆదివారం మధ్య పోప్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు వాటికన్ అధికారులు తెలిపారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల అంశంపై చర్చించేందుకు మంగళవారం రోమ్‌లో కార్డినల్స్ భేటీ జరగనుంది. ఇటలీ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఇది మొదలుకానుంది. రోమ్‌లో అందుబాటులో ఉన్న కార్డినల్స్ మొత్తాన్ని ఇప్పటికే ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయానికి సెయింట్ పీటర్స్ బసిలికాకు ఎప్పుడు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలనే విషయాన్ని నిర్ణయించనున్నారు.
అంత్యక్రియలకు ట్రంప్
ప్రస్తుతం వాటికన్‌లో తొమ్మిది రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అంత్యక్రియలు, ఖననం.. మరణించిన నాలుగు నుంచి ఆరు రోజుల మధ్య నిర్వహించనున్నారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. రోమ్‌లో జరిగే ఫ్యునరల్‌కు మెలానియాతో కలిసి వెళ్లనున్నట్లు ట్రంప్ చెప్పారు. ట్రుత్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.