RBI: సెప్టెంబర్ నుంచి కూరగాయల ధరలు తగ్గచ్చు : ఆర్‌బీఐ చీఫ్

ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామన్న శక్తికాంతదాస్

Update: 2023-08-24 03:30 GMT

ఆకాశంవైపుగా పరిగెత్తిన కూరగాయల ధరలు ఇకపై నేలకు రానున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ నుంచి దేశంలో కూరగాయల ధరలు తగ్గుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బుధవారం ప్రకటించారు. ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ చిరుధాన్యాల ధరలు కూడా అదుపులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

టమాటా ధరలు క్రమేణా తగ్గడం, ఉల్లి ధరలు పెరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. నిజానికి ద్రవ్యోల్బణం ప్రస్తుతం కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ అది క్రమక్రమంగా తగ్గుతోందని, ఆర్బీఐ చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉంటామని ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యానికి కేంద్ర బ్యాంకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధి సాధించటానికి ధరల్లో స్థిరత్వం కీలకమని, ప్రస్తుతం అభివృద్ధి అనుకూల వాతావరణం కూడా ఉందని పేర్కొన్నారు. రూపాయి విలువ స్థిరీకరణ కోసం డాలర్లను నిల్వచేసుకుంటున్నామని కూడా ఆయన వెల్లడించారు. వ్యవస్థాగతంగా బలం పుంజుకునేందుకు విదేశీ కరెన్సీ నిల్వలు పెంచుకోవటం అవసరమని వివరించారు.


లలిత్ దోషి స్మారకోపన్యాసంలో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్, పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు సరఫరా వైపు దృష్టి సారించాలని కోరారు. వాతావరణ ఎల్ నిలో పరిస్థితులు, రాజకీయ ఒత్తిళ్లు, ఆహార పదార్థాల ధరల్లో అనిశ్చితి ఆందోళన కరంగా ఉందని ఆయన చెప్పారు. దేశంలో సెప్టెంబరు నెల నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. తరచుగా ఆహార ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం అంచనాలు ప్రమాదాన్ని కలిగిస్తాయని, అసలు ఈ ధరల పెంపు గత ఏడాది సెప్టెంబర్ నుంచి కొనసాగుతోందని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో కూరగాయలు, చిరుధాన్యాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ధరల పెరుగుదల కట్టడికి ఆర్బీఐ గతేడాది మే నుంచీ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

Tags:    

Similar News