Venkaiah Naidu: ఆత్మకథ లాంటివి రాస్తే అనర్థాలు జరుగుతాయి: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: ప్రొటోకాల్‌ ఆంక్షలు తన స్వభావానికి, తత్వానికి సరిపడవంటూ చెప్పుకొచ్చారు వెంకయ్య నాయుడు.

Update: 2022-08-11 07:15 GMT

Venkaiah Naidu: ప్రొటోకాల్‌ ఆంక్షలు తన స్వభావానికి, తత్వానికి సరిపడవంటూ చెప్పుకొచ్చారు వెంకయ్య నాయుడు. దీని కారణంగానే ఉప రాష్ట్రపతి పదవిని తొలి నుంచి ఇష్టపడలేదన్నారు. బీజేపీ సభ్యత్వం తీసుకోబోనని స్పష్టం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఇకపై పదవులు తీసుకుని, మళ్లీ పోస్ట్‌మ్యాన్‌ కాదలచుకోలేదంటూ మాట్లాడారు. ఆత్మకథ లాంటివి, లేదా తన అనుభవాలను పుస్తకంగా రాస్తే అనర్థాలు జరుగుతాయంటూ కుండబద్దలు కొట్టారు.

ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల నుంచి వాజ్‌పేయి నేతృత్వంలో వచ్చిన పదవుల వరకు, తన ప్రస్థానం నుంచి మోదీ హయాం వరకు అన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు. మోదీకి అపూర్వమైన శక్తి ఉందని కితాబిచ్చిన వెంకయ్యనాయుడు.. నవ్వుతూ ఉండటం, అవసరమైనంత నిద్రపోవడం అనే రెండు సూచనలు మోదీకి చేశానన్నారు. ఇకపైనా కూడా తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్తానన్నారు.

ప్రజలతో నిరంతరం మమేకం కావడమే తనకు జ్ఞానాన్ని నేర్పిందని, ఉద్యమాలే తనను రాటుదేల్చాయని అన్నారు వెంకయ్యనాయుడు. జైఆంధ్ర ఉద్యమం, జేపీ ఉద్యమం, ఎమర్జెన్సీ నాటి జైలు జీవితాన్ని స్మరించుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో విశాఖ జైల్లో ఉన్నప్పుడు సంజయ్‌గాంధీని నాటి కేంద్రమంత్రి కొత్త రఘురామయ్య విశాఖకు తీసుకువచ్చి, ఓ బహిరంగ సభలో సంజయ్‌గాంధీని ఉదయిస్తున్న భారతతారగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

సంజయ్‌గాంధీ సభను భగ్నం చేసినందుకు తనను హైదరాబాద్‌ జైలుకు పంపారని చెప్పుకొచ్చారు. రాజకీయ జీవితం గురించి చెబుతూ.. ఒకవేళ తాను ఆత్మకూరులో ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై ఉండేవాణ్నేమోనని అన్నారు వెంకయ్యనాయుడు. ఇక వాజ్‌పేయి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి కావాలనుకున్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

కొన్ని పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధిశాఖ కోరినప్పుడు.. తనపై వాజ్‌పేయి అభిమానం పెరిగిందని గుర్తు చేసుకున్నార. మోదీ హయాంలో పట్టణాభివృద్ధిశాఖ ఇచ్చినప్పుడు కూడా అలాంటి సంఘటనే జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి పట్టణాభివృద్ధి గురించి ఏం తెలుసని అప్పట్లో మోదీని అడిగానన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నందున.. తనకు అదే కరెక్టు అని చెప్పి ఒప్పించారంటూ గతం గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News