Super Blue Full Moon: ఆకాశంలో అద్బుత దృశ్యం
ఇవాళ అరుదైన సూపర్ బ్లూ మూన్;
నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం కనపడనుండి. చంద్రుడు ‘బ్లూ సూపర్‌మూన్’గా దర్శనమివ్వబోతున్నాడు. పౌర్ణమి సాధారణంగా నెలలో ఒకసారి సంభవిస్తుంది, కానీ ఒక నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. ఆగస్టు నెలలో రెండు పౌర్ణమిలు ఉండటంతో బ్లూమూన్ కనిపిస్తుంది. మొదటి పౌర్ణమి ఆగస్టు 1న, రెండో పౌర్ణమి ఆగస్టు 30న ఉంటుంది. ప్రపంచం మొత్తం ఈ ఖగోళ అద్భుత దృశ్యాన్ని చూడ్డానికి సిద్ధమైంది.
చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరిగే క్రమంలో చంద్రుడు కొన్ని సార్లు భూమికి తక్కువ దూరంలో ఉంటాడు దీన్ని పెరజీ అని, దూరంగా పాయింట్ ను అపోజీగా పేర్కొంటారు. బుధవారం పెరజీ పాయింట్ వద్ద చంద్రుడు భూమికి దగ్గర రాబోతున్నాడు. ఈ రోజున చంద్రుడి పరిమాణం పగటి కంటే 14 శాతం పెద్దదిగా ఉంటుంది. ఈ దృశ్యం ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు కనిపిస్తుంది. అలాగే, ఇదే తరహా బ్లూమూన్ దృశ్యాలు చూడాలంటే మళ్లీ 2037లోనే ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంతరిక్షంలో కొన్ని ఖగోళ సంఘటనల కారణంగా అమావాస్య, పౌర్ణమి, సూపర్ మూన్, బ్లూమూన్ ఆకాశంలో కనిపిస్తాయి. బ్లూ మూన్ కూడా అలాంటి ఖగోళ సంఘటనలలో ఒకటి. ఇది పరిమాణంలో కొంచెం పెద్దది, అలాగే దాని రంగు కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఒక సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ నెలల్లో రెండు పౌర్ణమిలు ఉంటే, ఆ సంవత్సరాన్ని చంద్ర సంవత్సరం అంటారు. ఇలాంటి ఘటనే 2018లో చోటుచేసుకుంది. ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో రెండు చొప్పున పౌర్ణమిలు రావడంతో ఇది చంద్ర సంవత్సరంగా గుర్తింపు పొందింది.
మనం నెల రోజులు అని చెప్పుకుంటాం గానీ చంద్రుడు 29.53 రోజుల్లో భూమి చుట్టూ పరిభ్రమిస్తాడు. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. దీని ప్రకారం చంద్రుడు ఏడాదిలో భూమి చుట్టూ 12.27 సార్లు తిరుగుతాడు. భూమిపై సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. అలాగే, ప్రతి నెలా ఒక పౌర్ణమి ఉంటుంది. ఈ విధంగా చంద్రుడు ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో 12 సార్లు భూమి చుట్టూ పూర్తిగా పరిభ్రమించిన తర్వాత కూడా మరో 11 రోజులు మిగిలిపోతాయి. ప్రతి సంవత్సరం ఈ అదనపు రోజులను కలిపితే ఈ సంఖ్య రెండేళ్లలో 22, మూడేళ్లలో 33 అవుతుందనీ, ఈ కారణంగా, ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక అదనపు పౌర్ణమి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితిని బ్లూ మూన్ అంటారు. ఆగస్టు 30న వచ్చే బ్లూ మూన్ ఈ ఏడాదిలోనే అతి పెద్ద, ప్రకాశవంతమైన చందమామగా నిలిచిపోనుంది.