Vijay Rupani: లక్కీ నంబర్ 1206.. మరణం 12/06..
సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ..;
ఎయిరిండియా విమాన దుర్ఘటనలో మృతి చెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ కూడా అదృష్ట సంఖ్యను నమ్ముతారు. 1206ను ఆయన తన లక్కీ నంబర్‌గా విశ్వసిస్తారు. ఆయన బైక్, కారు.. ఇలా వాహనమేదైనా ఆ నంబర్ ఉండాల్సిందే. ఆ సంఖ్య అంటే ఆయనకు అంత ఇష్టం. అయితే, కాకతాళీయమే అయినా అదే సంఖ్య ఆయన ఆయువును బలిగొన్నది. విమాన ప్రమాదం జూన్ 12న జరిగింది. అంటే.. 12/06. నిజానికి అది ఆయన లక్కీ నంబర్.
కానీ, అదే రోజు ఆయన విమాన ప్రమాదంలో మరణించడం అందరినీ కలచివేసింది. నిజానికి ఆయన ఈ నెల 5 నుంచి 12 మధ్య లండన్‌లో పర్యటించాల్సి ఉన్నది. అయితే, లూధియానా వెస్ట్ ఉప ఎన్నిక కారణంగా దానిని వాయిదా వేసుకుని 12న ఆయన విమానమెక్కారు.
భాజపాకు చెందిన విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 68ఏళ్ల విజయ్ రూపానీ అసలు పేరు విజయ్‌భాయ్ రామ్‌నిక్‌లాల్‌భాయ్ రూపానీ. ఆయన 1956 ఆగస్టు 2వ తేదీన మయన్మార్‌లోని యాంగూన్‌లో జన్మించారు. రూపానీకి భార్య అంజలి, కుమారుడు రుషబ్, కుమార్తె రాధిక ఉన్నారు. మరో కుమారుడు పూజిత్ రూపానీ గతంలో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. లండన్‌లో ఉంటున్న తన భార్య, కూతురిని చూసేందుకు విజయ్ రూపానీ వెళ్తున్నారు. గత 6 నెలలుగా ఆయన సతీమణి లండన్‌లోనే ఉంటున్నారు. ఆమెని ఇండియాకి తిరిగి తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది.