Himanshi Narwal: ఆపరేషన్ మహాదేవ్‌పై స్పందించిన వినయ్ నర్వాల్ సతీమణి
చాలా సంతోషంగా ఉందన్న హిమాన్షి నర్వాల్;
ఆపరేషన్ మహాదేవ్‌పై పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్ స్పందించారు. పిరికివాళ్లు చంపబడ్డారని తెలిసి తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ తన భర్త త్యాగం కారణంగా ఉగ్రవాదం తొలగిపోతేనే ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఉగ్రవాదం దాని మూలాల నుంచి తొలగిపోవాలని కోరారు. ఉగ్రవాదుల్ని మట్టుమెట్టిన భద్రతా దళాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పహల్గామ్ ఉగ్ర దాడికి కొన్ని రోజుల ముందే వినయ్, హిమాన్షి వివాహం చేసుకున్నారు. వినయ్(26) నేవీ అధికారి. అయితే పెళ్లి తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అనంతరం హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. నవదంపతులిద్దరూ ఎంజాయ్ చేస్తుండగా ఊహించని రీతిలో ముష్కరులు విరుచుకుపడ్డారు. ఏప్రిల్ 22న మధ్యాహ్నం ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతంలోకి ప్రవేశించి విచాక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 26 మందిని భార్య, పిల్లల ముందే చంపేశారు. కొంతగా పెళ్లి చేసుకున్నట్లు వినయ్, హిమాన్షి ప్రాధేయపడినా కనికరించకుండా వినయ్‌ను భార్య కళ్లెదుటే చంపేశారు. అనంతరం భర్త దగ్గరే హిమాన్షి కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు అన్ని వైపులా భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తానికి నిఘా అధికారులకు అనుమానాస్పద సంభాషణ జరుగుతున్నట్లుగా గుర్తించి శ్రీనగర్‌లోని మహాదేవ్ అడవుల్లో నిఘా పెట్టారు. తాత్కాలిక డేరాలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా పక్కా సమాచారం రావడంతో జూలై 28న భద్రతా దళాలు రంగంలోకి దిగి హతమార్చేశారు. ప్రధాన సూత్రధారి సులేమాన్‌తో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.