Vinesh Phogat: రెజ్లింగ్‌కు వినేశ్ ఫొగాట్ గుడ్‌బై
నేను ఓడిపోయా అంటూ..!;
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు వినేశ్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు. ఓవర్ వెయిట్ కారణంగా పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్‌లో ఆడకుండా అనర్హత వేటు పడడంతో నిరుత్సాహానికి గురైన వినేష్.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పారు.
‘కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. రెజ్లింగ్‌కు గుడ్‌బై (2001-2024). నేను మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను క్షమించండి’ అని ఎక్స్‌లో వినేశ్ ఫొగాట్ రాసుకొచ్చారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన వినేశ్.. అనూహ్య రీతిలో అదనపు బరువుతో బుధవారం అనర్హతకు గురైన విషయం తెలిసిందే.
తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను వినేశ్ ఫొగాట్ ఆశ్రయించారు. తాను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్భిట్రేషన్ తీర్పు వెలువడించాల్సి ఉంది. ఇక స్వర్ణ పతక రేసులో ఉన్న వినేశ్‌పై అనర్హత వేటును ప్రతి భారత అభిమాని జీర్ణించుకోలేకపోతున్నారు.