పోలింగ్ బూత్ ధ్వంసం- బ్యాలెట్ పేపర్లకు నిప్పు
పశ్చిమ బెంగాల్లో రణరంగంగా పంచాయతీ ఎన్నికలు.... పోలింగ్ బూత్‌ను ధ్వంసం చేసిన దుండగులు.... గవర్నర్ అడ్డగింత;
పశ్చిమ బెంగాల్‌లో ఒకే దశలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. ఓటింగ్ ప్రారంభమైన కాసేపటికే తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నేతలు పరస్పర దాడులకు దిగారు. కూచ్‌బెహార్‌లోని సితాయ్ పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బరావిత ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ బూత్‌ను ధ్వంసం చేసి, బ్యాలెట్ పత్రాలకు నిప్పు పెట్టారు. కుర్చీలు, టేబుల్‌లను తగులబెట్టారు. ముర్షిదాబాద్‌లో టీఎంసీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఒక ఇల్లు ధ్వంసమైంది. బీజేపీ అభ్యర్థి ఇంటిపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు. మరోవైపు నార్త్ 24 పరగణాలో ఉన్న పోలింగ్ బూత్‌కు వెళ్తున్న సమయంలో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌ను స్థానికులు అడ్డుకున్నారు. సీపీఐ మద్దతుదారులు ఆయన్ను నిలదీశారు. వాహనాన్ని ఆపిన గవర్నర్ ఫిర్యాదులను స్వీకరించారు.
దక్షిణ 24 పరగణ జిల్లాలో బాంబులు, ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పంచాయతీ పోలింగ్ సందర్భంగా విధ్వంసం సృష్టించేందుకు బాంబులు, ఆయుధాలు నిల్వ ఉంచినట్లు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 22 జిల్లా పరిషత్, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లోని దాదాపు 928 స్థానాలకు
ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద భారీ క్యూలైన్‌లు కనిపిస్తున్నాయి. జూన్ 8న ఎన్నికలు ప్రకటించిన రోజు నుంచి బెంగాల్ అంతట పెద్ద ఎత్తున హింస చెలరేగింది. మొత్తం 12 మందికి పైగా దాడుల్లో మరణించారు. జూలై 1న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. మాల్దా జిల్లాలోనూ టీఎంసీ కార్యకర్తను కొట్టి చంపారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు టీఎంసీ, బీజేపీలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు పంచాయతీ పోల్స్ కీలకం కాబోతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఆ రాష్ట్రంలో ఈ ఎన్నికలు తీవ్ర హింసకు దారి తీశాయి. తొలిసారిగా రాజ్ భవన్ ఎన్నికల్లో కలుగజేసుకుంది. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తన అధికారికి నివాసంలో పీస్ హోమ్‌ని ప్రారంభించారు. గ్రామాలను తన గుప్పిట ఉంచుకునేందుకు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని అనుకుంటున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీలు పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి బీజేపీ తరుపున తీవ్రంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరుపున ఆ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి, సీపీఎం తరుపున మహ్మద్ సలీం ప్రచారం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో 70 దశకంలో పంచాయతీలు ప్రారంభమైతే, రెండోసారి రాష్ట్రంలో కేంద్ర బలగాల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. జూలై 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.