West Bengal : కౌంటింగ్ షురూ
మెజారిటీ స్థానాల్లో అధికార టీఎంసీ ముందంజ ఇప్పటి వరకు అడ్రస్ లేని బీజేపీ, కాంగ్రెస్;
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికల్లో హింస నేపథ్యంలో లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని చోట్ల ఉద్రిక్తత నెలకొంది. డైమండ్ హార్బర్ లోని ఓ పోలింగ్ కేంద్రం పైకి దుండగులు బాంబులు విసిరారు అయితే ఈ పేలుడులో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. మరో పోలింగ్ కేంద్రాన్ని స్థానికులు ముట్టడించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు కొద్దిపాటి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
మరోవైపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రాంతాల్లో అధికార టీఎంసీ దూసుకుపోతున్నది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకొనేలా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8న జరిగిన ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 22 జిల్లాల్లోని 339 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటిరకు రాష్ట్రంలోని సుమారు 74 వేల స్థానాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 3 వేల స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
బెంగాల్‌లో మొత్తం 63,229 గ్రామ పంచాయతీ స్థానాలు ఉండగా అధికార పార్టీ 2548 చోట్ల, బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సీపీఎం, కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరువలేదు. ఇక 9730 పంచాయతీ సమితిల్లో టీఎంసీ 261 చోట్ల ముందంజలో ఉన్నది. 928 జిల్లా పరిషత్ స్థానాల్లో 18 స్థానాల్లో మమతా బెనర్జీ పార్టీ దూసుకుపోతున్నది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఇప్పటి వరకు ఒక్క స్థానంలోనూ ఆధిక్యం కనబర్చలేదు.
ఈ నెల 8న రాష్ట్రంలోని 74 వేల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 80.71 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగుకు ముందు, పోలింగ్ రోజున చాలా చోట్ల హింస చెలరేగింది. కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులను తగలబెట్టారు. ఎన్నికల సందర్బంగా చెలరేగిన హింసలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం పంచాయతీల్లో గెలుపొందింది. 22 జిల్లా పరిషత్తులపై జెండా ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో కూడా పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.