Mamata Banerjee: అతనితో ఎలాంటి బంధం లేదు
సోదరుడితో ఎలాంటి రిలేషన్స్ లేదని తేల్చిచెప్పిన దీదీ;
బబూన్ బెనర్జీ తో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధాలు లేవని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బబూన్‌ను తన సోదరుడిగా పిలవద్దని సూచించారు. కుటుంబ పాలనను తాను నమ్మనని స్పష్టం చేశారు.
బబూన్ వ్యవహారంపై మమతా బెనర్జీ మరింత వివరణ ఇస్తూ.. ''ప్రతి ఎన్నికలకు ముందు అతను సమస్యలు సృష్టిస్తుంటాడు. దురాశా పరులంటే నాకు ఇష్టం ఉండదు. ఆనువంశిక పాలనపై నాకు నమ్మకాలు లేవు. అందువల్లే ఎన్నికల్లో అతనికి టిక్కెట్ ఇస్తూ వచ్చాను. ఇకనుంచి అతని దూరం పెట్టాలని, అన్ని సంబంధాలను తెంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను'' అని మమత నిష్కర్షగా చెప్పారు.
హౌరా సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి అదే నియోజకవర్గం నుంచి టీఎంసీ తిరిగి టిక్కెట్ ఇవ్వడంపై బాబూన్ బెనర్జీ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసూన్ బెనర్జీ ఎంపిక సరైనదని కాదని, అతని కంటే సమర్ధులు చాలా మంది ఉన్నారని అన్నారు. ప్రసూన్ తనను అవమానిస్తూ మాట్లాడిన మాటలు ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. ప్రసూన్‌ను హౌరా అభ్యర్థిగా ఎంపిక చేయడంపై తన వాదనను మమతా బెనర్జీ అంగీకరించరనే విషయం కూడా తనకు తెలుసునన్నారు. అవసరమైతే హౌరా నుంచి ఇంటిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. తాను బీజేపీలో చేరనున్నట్టు వస్తున్న ఊహాగానాలను కొట్టివేశారు. తాను దీదీతోనే ఉన్నానని, ఉంటానని, మమతా బెనర్జీ ఉన్నంత వరకూ వేరే పార్టీ ఆలోచన చేసేది లేదని చెప్పారు.
కాగా, బాబుల్ బెనర్జీ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ మండిపడ్డారు. అతను (బాబుల్) ఏమి చేసుకోవాలంటే అది చేసుకోవచ్చని, అధికార అభ్యర్థిగా ఉన్న ప్రసూన్ బెనర్జీ వైపే పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. 2009 నుంచి ప్రతిష్ఠాత్మక హౌరా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ప్రసూన్ బెనర్జీ ఎన్నికయ్యారు.