Women Reservation Bill : అసలేంటీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు..?

మహిళలకు కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా..?

Update: 2023-09-21 03:00 GMT

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు అమలులోకి వస్తే రాష్ట్రంలోని నియోజకవర్గాల ముఖచిత్రం మారనుంది. ఇప్పుడు ఉన్న స్థానాల ప్రకారం 8 లోక్‌సభ, 58 శాసనసభ స్థానాలు అతివలకే చెందనున్నాయి. మహిళా బిల్లు ఆమోదం పొందితే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమలవుతుంది. అప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తవనుంది. దీంతో స్థానాల సంఖ్య పెరిగితే ముఖచిత్రాలు తారుమారయ్యే అవకాశం ఉంది.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికప్పుడు కాకుండా. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే ఇది అమల్లోకి వస్తుందనే స్పష్టత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందనేదానిపై ప్రజాప్రతినిధులు ఆరా తీస్తున్నారు. ఈ బిల్లు వల్ల తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మహిళలకు కేటాయించే అవకాశం ఉందా అనే అంశంపై చర్చల్లో మునిగి తేలుతున్నారు. ఓటర్ల జాబితాలు దగ్గర పెట్టుకుని మరి వాటిని పరిశీలిస్తున్నారు.


 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నాటికే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని మొదట్లో ప్రచారం జరిగింది. దీంతో ఆ మార్పులు ప్రభావం, పర్యవసానం తమపై ఎలా ఉంటుందోనని తొలుత కొంతమంది ఆందోళన చెందారు. అయితే లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమల్లోకి వస్తుందనే స్పష్టత రావటంతో ఊరట పొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను విశ్లేషించగా  ఈ ఏడాది జనవరి 5వ తేదీ నాటికి ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా పరిధిల్లో పెద్దగా మార్పులు చేర్పులు లేకపోతే మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పెద్ద తేడా ఏమీ ఉండకపోవొచ్చు. నియోజకవర్గాల సంఖ్య పెరిగి వాటి పరిధిల్లో భారీగా మార్పులు, చేర్పులు చేసుకుంటే మాత్రం మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల ముఖచిత్రం కూడా మారే వీలుంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు అంశం ఉండటంతో  పునర్విభజన సమయంలో ఇక్కడి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

Tags:    

Similar News