one nation, one election: జమిలి వస్తే జరిగేదిదే

రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ

Update: 2024-03-15 01:15 GMT

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ జమిలి ఎన్నికలపై తమ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. మొత్తం 18 వేల 626 పేజీలతో కూడిన నివేదికను ముర్ముకు అందించింది.ఒకే దేశం- ఒకే ఎన్నికలకు కోవింద్‌ కమిటీ రెండంచెల విధానాన్ని సిఫారసు చేసింది. తొలుత లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్‌ నిర్వహించాలని సూచించింది. ఆ తర్వాత 100 రోజుల్లోపు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలో పలు సవరణలు చేయాల్సి ఉంటుందని...వాటిలో చాలా వరకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని పేర్కొంది.

హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు తలెత్తితే అప్పటికి మిగిలి ఉన్న ఐదేళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ తెలిపింది. మొదటి ఏకకాల ఎన్నికల కోసం అప్పటికే తాజాగా ఎన్నికలు జరిగి ఏర్పడిన కొత్త అసెంబ్లీలను వెంటనే రద్దు చేయకుండా తదుపరి లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగించవచ్చని ప్యానెల్ స్పష్టం చేసింది. ఇందుకోసం ఆర్టికల్ 83, ఆర్టికల్ 172లను సవరించాలని సూచించింది. ఈ రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరంలేదని పేర్కొంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల కోసం ముందస్తు ప్రణాళికను కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. 

లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి...ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటర్ గుర్తింపు కార్డ్‌లను సిద్ధం చేయాలని ప్యానెల్ సిఫారసు చేసింది. ఇందుకు అనుగుణంగా ఆర్టికల్‌ 325కు సవరణ చేయాలని సూచించింది. ఓటర్లలో పారదర్శకత, చేరిక, సౌలభ్యం, విశ్వాసాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సూచించింది. అభివృద్ధి ప్రక్రియ, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, ప్రజాస్వామ్య పునాదులను మరింత బలోపేతం చేయడానికి ఏకకాల ఎన్నికలు దోహదం చేస్తాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఏకకాల ఎన్నికల కోసం న్యాయపరంగా నిలిచే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. 

దాదాపు 191 రోజులు "ఒకే దేశం ఒకే ఎన్నిక" అంశంపై కోవింద్ కమిటీ పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 62 పార్టీలను తమ అభిప్రాయాలు తెలపాలని కోరింది. వీటిలో 47 రాజకీయ పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నికపై తమ అభిప్రాయాలు చెప్పాయి. వీటిలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతివ్వగా.... కాంగ్రెస్, ఆప్‌ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. మరో 15 పార్టీలు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ప్రజల నుంచి కూడా కోవింద్ కమిటీ సలహాలు, సూచనలు కోరగా.... 21 వేల 558 స్పందనలు వచ్చాయి. వీరిలో 80శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత కోవింద్ కమిటీ నివేదిక రూపొందించి రాష్ట్రపతికి అందజేసింది. 

Tags:    

Similar News