RAIN: అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగం
అకాల వర్షంతో అన్నదాతల్లో అలజడి... చాలా ప్రాంతాల్లో వడగళ్ల వానల హోరు... జిల్లాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షం... ఆకాల వర్షాలతో అన్నదాతల ఇబ్బందులు
చలికాలం ముగిసిపోతూ ఎండాకాలం ప్రారంభమవుతున్న ఈ సమయంలో అనూహ్యంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కొత్త ఆందోళనలను తెచ్చిపెట్టాయి. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండల తీవ్రత మొదలవుతుంటుంది. అయితే ఈసారి వాతావరణం పూర్తిగా మారి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న పంటలపై ఈ వర్షాల ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత మబ్బులు కమ్ముకుని, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వెదర్ మ్యాన్ విడుదల చేసిన హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుపానులు సంభవించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ప్రత్యేకంగా సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ కావడంతో రైతుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే పంటలు కోత దశలో ఉన్న నేపథ్యంలో వడగళ్ల వానలు కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాతావరణ నిపుణులు జోన్ల వారీగా వర్ష సూచనలు వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోన్-1 పరిధిలో ఉన్న మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశమూ ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు కురియనున్నాయి.
హైదరాబాద్లో వాతావరణ మార్పులు
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నగరవాసులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయాలు, నీటిముంపు సమస్యలు తలెత్తే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ అకాల వర్షాలు ముఖ్యంగా రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పంటలు కోత దశలో ఉన్నాయి. ముఖ్యంగా వరి, మక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలు వర్షాల వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది. వడగళ్ల వానలు కురిస్తే పంటలపై మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు భయపడుతున్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు పంటలను రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను త్వరగా సేకరించటం, నిల్వ సదుపాయాలను ఉపయోగించుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.