Himachal pradesh : సమోసాలు పోయాయని సీఐడీ విచారణ
సీఎం సుఖ్విందర్ సింగ్‌కు అందాల్సిన అల్పాహారం తినేసిన సిబ్బంది;
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. సమోసాలు పోయాయని ఏకంగా సీఐడీతో విచారణ చేయిస్తున్నది. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు, వెక్కిరింతలు వస్తున్నాయి. అక్టోబర్ 21న సిమ్లాలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసమని సీఐడీ మూడు బాక్సుల సమోసాలను ఆర్డర్ ఇచ్చింది. ఆ సమోసాలు ఆయనకు చేరకుండానే అయిపోయాయి.
సమోసాలు కార్యక్రమం వద్దకు రాకుండానే దారిమళ్లాయి. దీంతో సీఐడీ ఉన్నతాధికారులు ఈ అంశంపై విచారణ జరిపిస్తున్నారు. ఈ విచారణపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సమోసాలపై సీఐడీ విచారణ చేపట్టడం తెలివి తక్కువ తనమని, ప్రజా వ్యతిరేకమని మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విమర్శించారు. ‘సమోసాలు పోయాయని ఉన్నతాధికారులతో విచారణ చేపట్టడం హస్యాస్పదం. పలు శాఖల్లో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వాటిపై దృష్టి పెట్టాలి.’ అని బీజేపీ ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ సట్టి పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ఐదుగురు పోలీసులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా సీఎంకు అందించడానికి ప్రత్యేక బాక్సుల్లో సమోసాలు, కేక్‌లు తెప్పించారు. అయితే వీటిని సీఎం కోసం తెప్పించినట్టు ఒక ఎస్‌ఐకి మాత్రమే తెలుసు. ఆయన ఒక మహిళా ఇన్‌స్పెక్టర్‌కు వీటిని అందించారు. అయితే సీనియర్ అధికారులు ఎవరూ ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోడంతో బాక్సులను ఆమె సీఎం సిబ్బందికి, మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంటీ) విభాగం సిబ్బందికి అల్పాహారంగా అందించారని దర్యాప్తులో తేలింది.
సమోసాలపై విచారణ కాదు: సీఎం సుఖు
సమన్వయం లోపం కారణంగా సీఎంకు సమోసాలు చేరలేదన్న విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపట్టారు. ఈ బాక్సులను పర్యవేక్షించిన మహిళా ఇన్‌స్పెక్టర్ పైఅధికారుల నుంచి ఎలాంటి క్లియరెన్స్ లేకుండానే మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి పంపించారని, వాటిని సీఎం సిబ్బందికి వడ్డించారని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య అని సీఐడీ విడుదల చేసిన నివేదికలో ఒక అధికారి పేర్కొన్నారు. వీవీఐపీ గౌరవానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారు వారి సొంత ఎజెండా ప్రకారం వ్యవహరించినట్టు కనిపించిందని సీఐడీ నివేదిక పేర్కొంది.
సీఐడీ సిబ్బంది దుష్ప్రవర్తనపైనే విచారణ జరుగుతున్నదని, కానీ సమోసాలపై అంటూ వార్తలు ప్రసారం చేస్తున్నారని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు పేర్కొన్నారు. కాగా, ఇది పూర్తిగా సీఐడీ అంతర్గత వ్యవహారమని, రాజకీయం చేయొద్దని సీఐడీ డీజీ సంజీవ్ రంజన్ ఓఝా పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి సమోసాలు తినరు. మేము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. కేవలం ఏం జరిగిందో తెలుసుకోవాలని మాత్రమే చెప్పాం.’ అని ఆయన పేర్కొన్నారు.