Udaipur: ఉదయ్‌పూర్‌లో గ్యాంగ్‌ రేప్‌.. కంపెనీ సీఈవోతో సహా ముగ్గురి అరెస్ట్‌

నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

Update: 2025-12-26 06:30 GMT

రాజస్థాన్‌లో మహిళా ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కంపెనీ సీఈఓతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయ్‌పూర్‌లో ఒక ప్రైవేటు ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌పై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కంపెనీ సీఈవో జితేశ్ సిసోడియా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. నిందితుల్లో కంపెనీ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త కూడా ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

ఉదయ్‌పూర్‌లోని ఒక ఐటీ కంపెనీకి జితేశ్ సీఈవోగా ఉన్నారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా సంస్థలో పనిచేసే వారికి ఒక హోటల్‌లో పార్టీ ఇచ్చారు. అనంతరం మహిళా మేనేజర్ ఇంటికి వెళుతుండగా, కంపెనీలో పని చేస్తున్న మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ తన కారులో తీసుకువెళతానని చెప్పారు. అదే కారులో ఎగ్జిక్యూటివ్ హెడ్‌ భర్తతో పాటు కంపెనీ సీఈవో రాజేశ్ ఉన్నారు. మార్గమధ్యంలో వారు ఒక దుకాణంలో సిగరేట్ లాంటి పదార్థాన్ని మహిళా మేనేజర్‌కు ఇచ్చారు.

దానిని సేవించిన మహిళా మేనేజర్ స్పృహ కోల్పోగా, కదులుతున్న కారులో సీఈవో జితేశ్, ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త గౌరవ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు మెలకువ వచ్చాక ఇంటి వద్ద దింపకుండా, రాత్రంతా కారులో తిప్పుతూ వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జితేశ్ సిసోడియాకు చెందిన ఐటీ సంస్థ మహిళా స్నేహపూర్వక జాబితాలో 5కు గాను 4.7 రేటింగ్ పొందడం గమనార్హం.

Tags:    

Similar News