పల్లవి, బిజినెస్ డెస్క్: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించింది. 2024-25 ఆర్థిక ఏడాదిలో 7 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. గతంలో 6.6 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొన్న ప్రపంచబ్యాంక్.. తన అంచనాలను మార్పు చేసింది. వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థికవ్యవస్థ ఆశించిన స్థాయిలో రికవరీ అవుతుండడమే దీనికి కారణమని విశ్లేషించింది. ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నా భారత్ ఆర్థికవ్యవస్థ రాణిస్తుందని పేర్కొంది. ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి ఇటీవల భారత జీడీపీ వృద్ధి రేటు నెమ్మదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వెలువరించిన గణాంకాల ప్రకారం 6.7 శాతంగా నమోదైంది. ఎప్పుడో ఈ గణాంకాలు వెలువడాల్సిఉన్నా.. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఇటీవల ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశంలో భారత్ తొలి త్రైమాసికంలో 7.1 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. కానీ అంతకంటే తక్కువే నమోదైంది. ఈ క్రమంలోనే నొమురా పూర్తి ఏడాదికి వృద్ధి అంచనాలను 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. గోల్డ్‌మాన్ శాక్స్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు 6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నాయి. ప్రపంచబ్యాంక్ మాత్రం 7 శాతం నమోదుకావొచ్చని పేర్కొంది.