Delhi Floods:యమునా నది ఉధృతం.. ఇళ్లలోకి వరద నీరు, కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్!

స్కూళ్లు, ఆఫీసులు మూసివేత

Update: 2025-09-02 05:00 GMT

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ ఉదయం నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పాటు, ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి జనజీవనం పూర్తిగా స్తంభించింది.

నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా యమునతో పాటు పలు నదుల్లో నీటిమట్టాలు పెరిగాయి. దీంతో అధికారులు యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ గేట్లను ఎత్తివేశారు. ఫలితంగా యమునలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు, ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై ఏకంగా 7-8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు.

పరిస్థితిని సమీక్షిస్తున్న ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ), మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పాత రైల్వే వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. వరద ముప్పు నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, నదీ పరీవాహక ప్రాంతంలోకి నీరు రావడం సహజమైన ప్రక్రియేనని ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు. యమునా నది లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సోమవారమే హెచ్చరికలు జారీ చేశారు.

వరదల ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. రన్‌వేలపై నీరు నిలిచిపోవడం, దృశ్యమానత తగ్గడంతో పలు విమానయాన సంస్థలు ప్రయాణ సూచనలు జారీ చేశాయి. సెప్టెంబర్ 4 వరకు ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. కాగా, 2023లో కూడా ఇలాంటి భారీ వర్షాలకే ఢిల్లీలో తీవ్ర వరదలు సంభవించి, 25,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News