DELHI FLOODS: యమునా నది మహోగ్రరూపం

45 ఏళ్ల గరిష్ఠ స్థాయిని చేరిన యమునా నది నీటిమట్టం... ఢిల్లీలోని కాలనీల్లోకి వరద నీరు.. అత్యవసర సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్‌...

Update: 2023-07-12 09:45 GMT

ఢిల్లీలో యమునా నది ‍(yamuna river) మహోగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం ప్రమాదకరస్థాయి దాటింది. ఢిల్లీ (Delhi)లో 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి చరిత్రలో తొలిసారి యమునా నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. దీంతో అనేక కాలనీల్లో వరద నీరు (Floods) చేరింది. కేంద్ర జల కమిషన్‌ సమాచారం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి దిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.55 మీటర్లకు పెరిగింది. ప్రజలు నివసిస్తున్న కొన్ని కాలనీల్లోకి వరద ముంచెత్తింది. ఇళ్లు, మార్కెట్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నది నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా దేశ రాజధానిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు.


45 ఏళ్ల తర్వాత యమునా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తుండడంతో ఏ క్షణాన వరదలు సంభవిస్తాయేమోనని ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. 1978లో యమునా నది (yamuna river) నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీలో భీకర వరదలు సంభవించాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. ఢిల్లీ సర్కార్‌(delhi govt) యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు కూడా నీట మునిగాయి.


యమునా నది (Yamuna River) ప్రమాదకర స్థాయి 205.33 మీటర్ల కాగా.. ఆ మార్క్‌ను రెండు రోజుల క్రితమే దాటింది. 2013 తర్వాత మళ్లీ బుధవారం ఉదయమే 207 మార్క్‌ను తాకిన నది నీటిమట్టం ఇవాళ మధ్యాహ్నానికి ఏకంగా 207.55 మీటర్లుగా నమోదైంది. ఈ స్థాయిలో యమునా నది నీటిమట్టం పెరగడం ఇదే తొలిసారి. ఇవాళ్టీకి చరిత్రలోనే నదిలో గరిష్ట నీటిమట్టం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (kejriwal) ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News