Yamuna River: ఢిల్లీలో డేంజ‌ర్ మార్క్ దాటిన య‌మునా న‌ది..

హ‌త్నికుండ్ బ్యారేజ్‌ 18 గేట్లు ఎత్తివేత‌;

Update: 2025-08-18 07:00 GMT

య‌మునా న‌ది ఉప్పొంగుతున్న‌ది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో య‌మునా న‌ది డేంజ‌ర్ మార్క్ దాటి ప్ర‌వాహిస్తోంది. ఆగ‌స్టు 19వ తేదీ నాటికి 206 మీట‌ర్ల మార్క్‌ను యమునా న‌ది తాక‌నున్న‌ట్లు కేంద్ర జ‌ల సంఘం పేర్కొన్న‌ది. 205.33 మీట‌ర్ల‌ను డేంజ‌ర్ మార్క్‌గా గుర్తిస్తున్నారు. ఒక‌వేళ న‌ది 206 మీట‌ర్ల‌ను తాకితే, అప్పుడు ఢిల్లీలో త‌ర‌లింపు ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. ఇవాళ ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో.. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వ‌ద్ద య‌మునా న‌ది ప్ర‌వాహం 204.8 మీట‌ర్లుగా ఉన్న‌ది. ఆదివారం సాయంత్రం204.6 మీట‌ర్లుగా ఉన్న‌ది. అయితే వార్నింగ్ మార్క్‌ను మాత్రం 204.5 మీట‌ర్లుగా ఫిక్స్ చేశారు. గ‌త రెండు రోజుల నుంచి వ‌రుస‌గా వార్నింగ్ మార్క్‌పైనే న‌ది ప్ర‌వాహిస్తున్న‌ట్లు గుర్తించారు. అన్ని ఏజెన్సీలు అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. వ‌ర‌ద ఉదృతిని స‌మీక్షించేందుకు ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్‌ను కీల‌క‌మైన పాయింట్‌గా భావిస్తారు.

వ‌జీరాబాద్‌, హ‌త్నీకుండ్ బ్యారేజ్‌ల నుంచి వ‌స్తున్న నీటితో.. ఢిల్లీలో య‌మునా న‌ది నీటిమ‌ట్టం పెరిగింది. హ‌త్నీకుండ్ నుంచి 58,282 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. వ‌జీరాబాద్ నుంచి గంట‌కు 36,170 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. అయితే ఈ నీరు ఢిల్లీని చేరేందుకు క‌నీసం 50 గంట‌లు ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ది. ఈ సీజ‌న్‌లో తొలిసారి హ‌త్నీకుండ్ బ్యారేజ్‌లో ఉన్న అన్ని 18 గేట్ల‌ను ఎత్తివేశారు.

హ‌ర్యానా, పంజాబ్‌కు ఐఎండీ తాజా వార్నింగ్ ఇచ్చింది. ఆ రెండు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. క‌ర్న‌ల్‌, ఇంద్రి, త‌నేస‌ర్‌, అంబాలా, పాటియాలా, మొహాలీ, లుథియానాకు భారీ వ‌ర్ష సూచ‌న ఉన్న‌ది.

Tags:    

Similar News