YOGI: భవిష్యత్త్ భారత రథసారధి యోగీ!
ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం;
ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరో ప్రభంజనం. దేశ వ్యతిరేక శక్తులపై ఆయన తీసుకునే కఠిన చర్యలు ఓ సంచలనం. ఆ ఉక్కు మనిషి ప్రశంసలకు పరవశులైపోరు. కఠిన నిర్ణయాలకు వెనుకాడరు. కష్టనష్టాలకు బెదరరు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వెను తిరిగి చూడరు. విద్యార్థి దశ నుంచే చురుకుదనాన్ని, కరకుదనాన్ని ప్రదర్శించి.... తాను విశ్వసించిన సిద్ధాంతం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమవుతారు. అయోధ్య రామ మందిర ఉద్యమంలో చేరేందుకు 21 ఏళ్ల వయసులోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్. ప్రధాని మోదీ రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్న వేళ.. భారత భవిష్యత్త్ రథసారధిగా యోగి ఆదిత్యనాథ్ పేరు బలంగా వినిపిస్తోంది.
మోదీ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేయగల సామర్థ్యం యోగీకే ఉన్నాయని ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తోంది. దేశం కోసం ఎంతటి త్యాగానికైనా... ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనకాడబోరన్నది దేశానికి తెలిసిన సత్యం. మరి యోగీ నిజంగానే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడతారా అంటే బీజేపీ శ్రేణుల నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలే మోదీ రిటైర్ మెంట్ పై అనేక అనుమానాలను.. ప్రశ్నలను లేవనెత్తాయి. ప్రధాని మోదీ సెప్లెంబర్లో రిటైర్డ్ అవ్వాలనుకుంటున్నారని... అందుకే ఆయన సడెన్గా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ వారసుడిని త్వరలోనే ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తోందని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్త చర్చ ఆరంభమైంది. ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం బీజేపీ నేతల్లో 74ఏళ్లు దాటిన వారు ఎవరూ కీలక పదవుల్లో ఉండకూడదని నిబంధన ఉంది. ప్రస్తుతం నరేంద్ర మోదీకి 74వ ఏట ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న మోదీ 75వ పుట్టిన రోజు. ఈ నెలలోపు ఆర్ఎస్ఎస్ మోదీతో ప్రధాని పదవికి రాజీనామా చేయిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. గతంలో ఎల్‌కే అద్వానీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమాయానికి ఆయనకు 74ఏళ్ల పైబడి వయసు ఉందని 2014లో మోదీని బీజేపీ అధిష్టానం ప్రధానిగా ప్రకటించింది.
యోగీకే దక్కుతుందా..?
ఓవైపు జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతల ఎదుగుదల.. మరోవైపు ప్రధాని మోదీకి వయసు పెరుగుదల వంటి కారణాలతో ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు రథసారధిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ కారణాలతో ఇప్పుడిప్పుడే మోదీని పక్కన బెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం లేదని కొందరు నిపుణులు అంటున్నారు. కానీ ఆయన తర్వాత ప్రధాని ఎవరనే దాని కోసం అన్వేషణ, నేతలను తయారు చేయడం వంటివాటిపై ఆర్ఎస్ఎస్ లో ఇప్పటికే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని పదవికి యోగీ అదిత్యనాథ్- అమిత్ షా మధ్య పోటీ నెలకొందని పలువురు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాని పదవి పోటీ నుంచి యోగిని తప్పించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని.. కానీ ఆయనకు సరైన అవకాశం దొరకడం లేదని... అమిత్ షాకు అధికారాలు ఉండి ఉండొచ్చు కానీ, ప్రజల దృష్టిలో ఆయన అంత గొప్పగా ఏమీ లేరని అలహాబాద్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ పంకజ్ కుమార్ అంచనా వేశారు. బీజేపీని ఇష్టపడే ఓటర్లలో మోదీ తర్వాత యోగి రెండోస్థానంలో ఉన్నారని.. యూపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అమిత్ షా కంటే యోగికే ఆదరణ ఎక్కువని మరో రాజకీయ నిపుణుడు అంచనా వేశారు. అయితే తదుపరి ప్రధానిగా ఎవరిని ఎనుకున్నా అది సంఘ్ మద్దతు, మార్గదర్శకాలు, పరస్పర చర్చల ద్వారానే ఉంటుందన్నది మాత్రం సుస్పష్టం.