Zomato CEO: జొమాటో సీఈవోకు చేదు అనుభవం..
మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది;
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. విధుల్లో ఉన్న సమయంలో తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న ఇబ్బందికర పరిస్థితుల్ని తెలుసుకునేందుకు భార్య గ్రేసియా మనోజ్ తో కలిసి డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు ఓ మాల్‌కు వెళ్లగా.. అక్కడ ఆయన్ని లిఫ్ట్‌లోకి అనుమతించలేదు. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి దీపిందర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
గురుగ్రామ్‌లోని ఓ మాల్లో హల్దీరామ్స్ నుంచి ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడ లిఫ్ట్‌లోకి తనను అనుమతించలేదని చెప్పారు. మెట్ల మార్గం నుంచే వెళ్లాల్సిందిగా వారు సూచించినట్లు చెప్పారు. దీంతో మూడు అంతస్తులు మెట్లెక్కి వెళ్లానని.. ఆర్డర్ కలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మెట్ల ద్వారం వద్దే ఎదురుచూడాల్సి వచ్చిందని వివరించారు. పని సమయంలో డెలివరీ పార్టనర్ల పరిస్థితులు మెరుగుపర్చడం కోసం మాల్స్ యాజమాన్యంతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్ యాజమాన్యాలు కూడా డెలివరీ ఏజెంట్ల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే
‘‘డెలివరీ పార్టనర్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో నాకొక విషయం అర్థమైంది. మేం గురుగ్రామ్‌లోని ఒక మాల్లో హల్దీరామ్స్ నుంచి ఆర్డర్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లాం. వేరే ఎంట్రన్స్ నుంచి వెళ్లాలని నాకు సూచించారు. అక్కడ ఎలాంటి ఎలివేటర్లు లేవు. అదే విషయాన్ని నిర్ధరించుకోవడానికి మరోసారి ప్రధానద్వారం వద్దకు వెళ్లాను. లిఫ్ట్‌కు అనుమతి లేదని తెలిసి.. మూడు అంతస్తులు మెట్లెక్కి వెళ్లాను. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేప్పుడు కూడా మెట్లద్వారం వద్దే ఎదురుచూడాల్సిన పరిస్థితి. పని సమయంలో డెలివరీ పార్టనర్ల పరిస్థితులు మెరుగుపర్చడం కోసం మాల్స్ యాజమాన్యంతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించాను. మాల్స్ కూడా వారిపై మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తర్వాత ఇతర ఏజెంట్లతో కాసేపు ముచ్చటించానని, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నానని తెలిపారు.
దీనిపై నెటిజన్లు స్పందించారు. మాల్స్ వద్దే కాదు.. కొన్ని కమ్యూనిటీల్లో కూడా మెయిన్ లిఫ్ట్ వాడేందుకు డెలివరీ ఏజెంట్లను అనుమతించరని తెలిపారు. వారు కూడా అందరిలాగే మెయిన్ లిఫ్ట్ వాడేలా చూడాలని, ఇందులో ఎలాంటి వివక్ష ఉండకూడదని రాసుకొచ్చారు. గతవారం కూడా గోయల్ ఓ వీడియో షేర్ చేశారు. గురుగ్రామ్ వీధుల్లో ఆర్డర్లు డెలివరీ చేస్తూ తన రైడ్‌ను ఎంజాయ్ చేశారు. వినియోగదారులకు ఫుడ్ డెలివరీ చేయడాన్ని ఇష్టపడతానని పేర్కొన్నారు. అలాగే తన భార్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు షేర్ చేశారు.