Harnaaz Sandhu: అప్పుడు సన్నగా ఉన్నానని డిప్రెషన్.. ఇప్పుడు 'మిస్ యూనివర్స్'గా ప్రమోషన్..

Harnaaz Sandhu: భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.

Update: 2021-12-13 05:31 GMT

Harnaaz Sandhu (tv5news.in)

Harnaaz Sandhu: భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. హర్నాజ్ సంధు కంటే ముందు, ఇద్దరు భారతీయులు మాత్రమే మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు.


1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. లారా దత్తా 2000లో టైటిల్‌ను గెలుచుకున్న 21 సంవత్సరాల తర్వాత భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుని కిరీటానికి వన్నె తెచ్చింది.



సంధు ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల పరాగ్వేకు చెందిన నాడియా ఫెరీరా మరియు దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానేలను అధిగమించి కిరీటాన్ని కైవసం చేసుకుంది. సంధుకు మెక్సికో మాజీ మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా మెజా కిరీటాన్ని అందించారు.



యువతులు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి.. అలాంటి వారికి మీరు ఏం సలహా ఇస్తారని మిస్ యూనివర్స్ ప్యానెల్ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. "ఈనాటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి ఏమిటంటే తమ మీద తమకి నమ్మకం లేకపోవడం.. మీరు ప్రత్యేకమైన వారని, ఇతరుల కంటే భిన్నమైన వారని తెలుసుకోవడం.. అదే మిమ్మల్ని అందంగా చేస్తుంది. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.



ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. బయటకు రండి, మీ కోసం మాట్లాడండి ఎందుకంటే మీరే మీ జీవితానికి నాయకత్వం వహించాలి. మీరు మీ స్వంత గొంతును వినిపించాలి. నన్ను నేను నమ్మాను అందుకే నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను" అని సంధు చెప్పారు.



17 సంవత్సరాల వయస్సులో అందాల పోటీల్లో పాల్గొంటూ తన ప్రయాణాన్ని ప్రారంభించిన సంధు, గతంలో మిస్ దివా 2021, ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 కిరీటాన్ని గెలుచుకుంది. 


ఫెమినా మిస్ ఇండియా 2019లో టాప్ 12లో కూడా నిలిచింది. శ్రీమతి సంధు రెండు పంజాబీ చిత్రాలు "యారా దియాన్ పూ బరన్", "బాయి జీ కుట్టాంగే" ల్లో నటించింది. 


చిన్నప్పుడు హర్నాజ్ సంధు చాలా సన్నగా ఉండడంతో తన స్నేహితులంతా తనను ఏడిపించేవారట. దీంతో కొంతకాలం తాను డిప్రెషన్‌లోకి వెళ్లిందట. కానీ తన కుటుంబం సహాయంతో డిప్రెషన్ నుండి కోలుకొని ఇప్పుడు ఏకంగా మిస్ యూనివర్స్ కిరీటాన్నే దక్కించుకుంది హర్నాజ్.



Tags:    

Similar News