President Trump: రష్యాతో వ్యాపారం చేస్తే 500శాతం టారిఫ్
చట్టం రూపొందిస్తున్నట్టు ట్రంప్ వెల్లడి
రష్యాను ఏ రకంగానూ లొంగదీసుకోలేకపోతున్న అమెరికా ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర దేశాలపై బెదిరింపులకు దిగుతున్నది. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ‘అతి తీవ్రమైన ఆంక్షలు’ విధిస్తామని హెచ్చరించేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు మాస్కోను లక్ష్యంగా చేసుకొని రిపబ్లికన్ ప్రజాప్రతినిదులు ఒక కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. రష్యా, దాని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికన్ కాంగ్రెస్ ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా? అన్న ప్రశ్నకు అధ్యక్షుడు ట్రంప్ సమాధానమిస్తూ.. ‘రిపబ్లికన్లు ఓ చట్టాన్ని రూపొందించనున్నారు.
అది నాకు సమ్మతమే. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై అతి తీవ్రమైన ఆంక్షలు విధించనున్నారు. ఇరాన్‌ను కూడా జతచేయమని నేను చెప్పాను’ అని అన్నారు. రష్యాతోపాటు ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా మరిన్ని కఠిన ఆంక్షలకు దిగనున్నది. ఈ మేరకు సెనెటర్ లిండ్సే గ్రాహం సెనేట్ విదేశీ సంబంధాల కమిటీకి ప్రతిపాదించిన బిల్లు ప్రకారం రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించే దేశాలపై 500 శాతం టారిఫ్ విధించనున్నారు.