ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారి పల్లె పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేతలు అరాచకానికి ఒడిగట్టారు. టీడీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసి పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు లాగేశారు. అనంతపురం జిల్లా చాపాడు మండలంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వైసీపీ నాయకులు గుంపులుగా వచ్చారు. వారిని కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కర్నూల్ జిల్లా హాలహర్వి 74, బాపురం 22 నెంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదు. మరోవైపు తెలంగాణలో మాత్రం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.