USA: అమెరికాలో దుండగుల కాల్పులు.. ఆరుగురి మృతి
ఈస్టర్న్ మిసిసిపీలోని వెస్ట్ పాయింట్ పట్టణ పరిసరాల్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు
అమెరికాలోని ఈస్టర్న్ మిసిసిపీలో శుక్రవారం రాత్రి జరిగిన వరుస కాల్పుల ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అలబామా సరిహద్దుకు సమీపంలోని వెస్ట్ పాయింట్ పట్టణంలో ఈ దాడులు జరిగాయి. మొత్తం మూడు చోట్ల నిందితుడు కాల్పులు జరిపినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. "హింస కారణంగా పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దాదాపు 20 వేల జనాభా కలిగిన క్లే కౌంటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. గతేడాది అక్టోబర్‌లో కూడా మిసిసిపీలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరిగాయి. అప్పట్లో లేల్యాండ్ నగరంలో జరిగిన దాడిలో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.