Odisha: రైతు వేషంలో కలెక్టర్, ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాల గుట్టురట్టు
రైతులను మోసం చేస్తున్న అధికారికి షోకాజ్ నోటీసు
కలెక్టర్ మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్‌లు సినిమాల్లో చూస్తుంటాం. ఒడిశాలోని భద్రక్ జిల్లా కలెక్టర్ దిలీప్ రౌత్రాయ్ నిజజీవితంలో ఈ పని చేసి, అక్రమార్కులకు వణుకు పుట్టించారు. ఓ ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాలను గుర్తించి, చర్యలు చేపట్టారు. వరి సేకరణ కేంద్రాల్లో పంట దిగుబడిలో నాణ్యత లేదని పేర్కొంటూ తమకు తక్కువ ధర ఇస్తున్నారని రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో తానే స్వయంగా వెళ్లాలని కలెక్టర్ నిర్ణయించారు. ధామ్‌నగర్ బ్లాక్‌లోని కాటాసాహి మండీలోని ధాన్యం సేకరణ కేంద్రానికి రైతు వేషధారణలో వెళ్లారు. కొంత ధాన్యాన్ని విక్రయించేందుకు కాంటాకు వెశారు. అయితే, వృధా సాకుతో 8 కిలోలకు డబ్బులు తక్కువ ఇస్తానని అధికారి చెప్పాడు. సదరు అధికారికి షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు కలెక్టర్ తెలిపారు.