Arvind Kejriwal: సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌

ఇకపై మాజీ సీఎం ఎక్కడుంటారంటే;

Update: 2024-10-04 06:15 GMT

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌  ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు (vacates his residence). ఇటీవలే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఈ నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై కేజ్రీ తన కుటుంబంతోపాటు ఫిరోజ్‌షా రోడ్డులో ఉన్న ఆప్‌ రాజ్యసభ ఎంపీ అశోక్‌ మిట్టల్‌ ఇంట్లో నివాసం ఉండనున్నారు.

రాజీనామా తర్వాత తాను ఉండేందుకు కేజ్రీ ఓ ఇంటి కోసం తీవ్రంగా వెతికారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు కేజ్రీకి తమ ఇళ్లలో ఉండాల్సిందిగా అభ్యర్థించారు. ఆప్‌ చీఫ్‌ మాత్రం చివరికి తన పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ అశోక్‌ ఇంటిని ఎంచుకున్నారు. ఫిరోజ్‌షా రోడ్డులోని బంగ్లా నంబర్‌ 5ను పంజాబ్‌కు చెందిన ఆప్‌ రాజ్యసభ ఎంపీ అశోక్‌ మిట్టల్‌కు అధికారికంగా కేటాయించారు. ఇకపై కేజ్రీ ఈ బంగ్లాలోనే ఉండనున్నారు. కేజ్రీ తన ఇంటిని ఎంచుకోవడం పట్ల అశోక్‌ మిట్టల్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టైన కేజ్రీవాల్‌కు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. దీంతో బెయిల్‌పై బయటకు వచ్చిన కేజ్రీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు సమర్పించారు. ఈ క్రమంలోనే సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలను కేజ్రీ వదులుకున్నారు. ఇక కేజ్రీ తర్వాత ఢిల్లీ పగ్గాలు అతిశీ అందుకున్న విషయం తెలిసిందే. నాలుగు నెలల పాటు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

Tags:    

Similar News