Maharashtra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలకు తప్పిన ప్రమాదం
ప్రతికూల వాతావరణంతో దారితప్పిన హెలికాప్టర్;
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడణవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. ఇద్దరూ పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఓ కార్యక్రమం కోసం గడ్చిరోలికి వెళుతుండగా.. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంతో దారి తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు ఇద్దరూ పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సామంత్‌తో కలిసి నాగ్‌పుర్ నుంచి గడ్చిరోలి బయలుదేరగా.. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రతికూల వాతావరణంతో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో ఆందోళన చెందినట్టు అజిత్ పవార్ తెలిపారు. ‘‘రుతుపవన మేఘాలు ఒక్కసారిగా కమ్ముకోవడంతో మా హెలికాప్టర్ దారి తప్పింది. ఆ సమయంలో నేనెంతో భయపడ్డా. దేవేంద్ర మాత్రం చాలా కూల్‌గా ఉన్నారు. గతంలో ఇలాంటి ఆరు ప్రమాదాల నుంచి బయటపడ్డానని.. ఇప్పుడు కూడా ఏమీకాదని ఆయన ధైర్యం చెప్పారు’’ అని అజిత్ వెల్లడించారు.