Usa : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. స్పాట్లోనే నలుగురు మృతి
దక్షిణ కరోలినాలోని సెయింట్ హెలినా దీవిలో కాల్పులు
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కరోలినాలోని సెయింట్ హెలినా దీవిలో తెల్లవారుజామున ఓ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. విల్లీస్ బార్ అండ్ గ్రిల్‌లో ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో జనాలు ఉండటం గమనించిన దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారని.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తుపాకీ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు అనేక మంది సమీపంలోని షెల్టర్లు, షాపుల్లోకి పరిగెత్తారని వివరించారు.