వైసీపీ సర్కార్ గిరిజనులను విస్మరించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైరయ్యారు. యువగళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కల్లూరులో.. గిరిజనులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. జగన్ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని లోకేష్ విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు తెస్తున్నారన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకానికి పేరు మార్చి.. జలకళగా మార్చారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ జగన్ అటకెక్కించారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీలకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు వేస్తామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని అన్నారు.