ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు కూలీలతో వెళ్తున్న ఆటో ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఆరుగురు కూలీలతోపాటు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బీహార రాష్ట్రం పట్నాజిల్లాలోని మాసౌర్హి- నౌబత్‌పూర్ రహదారిపై ధనిచక్‌మోర్ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతిచెందిన కూలీలు అంతా పట్నా జిల్లాలోని డోరిపూర్ గ్రామానికి చెందినవారు కాగా.. డ్రైవర్ సుశీల్‌కుమార్ హన్సదిహ్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆరుగురు కూలీలు పనికి వెళ్లి సాయంత్రం ఆటోలో ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టగానే రెండు వాహనాలు రోడ్డు పక్కనున్న లోతైన నీటి గుంతలో పడిపోయాయి. దాంతో జేసీబీల ద్వారా మృతదేహాలను బయటికి తీశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. జేసీబీని రప్పించి నీటి గుంతలో నుంచి మృతదేహాలను బయటికి తీయించారు. అనంతరం పోస్టుమార్టానికి పంపించారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.