ఔటర్ రింగ్ రోడ్డు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ చేతిలోకి వెళ్లిపోయంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన ఔటర్‌ను 30 ఏళ్లపాటు ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించి, టెండర్లు కూడా పిలిచింది. టెండర్ ప్రక్రియలో నాలుగు సంస్థలు పాల్గొనగా.. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ రూ.7,380 కోట్లకు దక్కించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఔటర్‌పై టోల్ వసూళ్లతో పాటు నిర్వహణ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఔటర్‌ను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు హెచ్‌ఎండీఏ అధికారులు అప్పగించేశారు.
ఔటర్‌పై శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకూ ఈగిల్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్ పేరిట టోల్ రసీదు రాగా.. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వచ్చింది. ఇక 30 ఏళ్లపాటు ఔటర్‌పై వచ్చే ఆదాయమంతా ఇక ఐఆర్‌బీదే. టెండరు మొత్తం రూ.7,380 కోట్లను చెల్లించిందని, దాంతో, ఔటర్‌ను ఐఆర్‌బీకి అప్పగించే ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి లాంఛనంగా పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.