PM Modi: వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని
కోడె మొక్కులు తీర్చుకున్న మోదీ;
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా నిలిచే కోడె మొక్కులను ప్రధాని తీర్చుకున్నారు. అనంతరం ప్రధానికి వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆయనను ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక మెమొంటో, శాలువాతో సత్కరించడం జరిగింది. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి భాజపా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ వేములవాడ, వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రసంగించనున్నారు. మొదట వేములవాడ సభలో పాల్గొని అక్కడి నుంచి వరంగల్ వెళ్లనున్నారు. అక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు మద్దతుగా బహిరంగ సభలో మోదీ మాట్లాడుతారు.