Rahul Gandhi: రాహుల్ గాంధీ కాన్వాయ్ లో భద్రతా లోపం..
రాహుల్ కాన్యాయ్ పక్క నుంచి కర్ర పట్టుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి..;
కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ పక్కగా కర్ర చేత పట్టుకున్న ఒక వ్యక్తి బైక్‌పై వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో ఈ సంఘటన జరిగింది. రాహుల్ గాంధీ సోమవారం హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఒక వ్యక్తి కలకలం సృష్టించాడు. రాహుల్ గాంధీ వాహనం పక్కగా బైక్‌పై వెళ్లాడు. వృద్ధుడైన ఆ వ్యక్తి చేతిలో పొడవైన కర్ర కూడా ఉన్నది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ కీలక నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పక్కగా బైక్ వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించడంపై విమర్శలు వచ్చాయి. మరోవైపు 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరుగనున్నది. అక్టోబర్ 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.