Rapido: క్యాబ్ సేవల విభాగంలోకి ర్యాపిడో
ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులో;
ఇప్పటి వరకు బైక్, ఆటో రైడ్ సేవలు అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్ సేవల విభాగంలోకి కూడా అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో ఇకపై ర్యాపిడో పోటీపడనుంది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ , హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో దాదాపు 1.2 లక్షల క్యాబ్‌లతో ఈ సేవలను ర్యాపిడో ప్రారంభించింది. 2024 సెప్టెంబర్ నాటికి క్యాబ్ సేవలను 35 నగరాలకు విస్తరిస్తామని ర్యాపిడో సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు అందించి, మార్కెట్ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. సున్నా కమీషన్ మోడల్‌తో చోదకుల ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామన్నారు.