కేసీఆర్ పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని... పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటా అని కేసీఆర్ అనుకుంటున్నారని... అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డిని అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను జైలులో పెడతామని. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు. ఆయన కాలు విరిగింది. కూతురు జైలుకెళ్లారని జాలి చూపించాం. దిల్లీ నుంచి తెలంగాణకు నిధులు కావాలంటే.. 14 మంది ఎంపీలను గెలిపించండని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు. జూన్ 9న ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని హస్తం శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన ‘ కాంగ్రెస్ జనజాతర’ సభలో రేవంత్ కేసీఆర్, మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో.. కేంద్రంలో బీజేపీని అలాగే ఓడించాలన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని కోరారు. కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. గుజరాత్ మోడల్‌పై ‘వైబ్రెంట్ తెలంగాణ’ ఆధిపత్యం చూపిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారు. ఈ క్రమంలో 750 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించలేదన్నారు.