Edible Cement"ఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్
ఇండోర్ ఐఐటీ పరిశోధకుల వినూత్న ఆవిష్కరణ;
ఆహార వ్యర్థాలు వృథా కాకుండా వినియోగించుకునేందుకు ఇండోర్ ఐఐటీ పరిశోధకులు ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఆ వ్యర్థాలను ‘ఈ-కొలి’ లాంటి నాన్-పాథోజెనిక్ (వ్యాధులను సంక్రమింపజేయని) బ్యాక్టీరియాతో కలిపి కాంక్రీట్‌లో మిళితం చేయడం ద్వారా దృఢమైన నిర్మాణ పదార్థాన్ని తయారు చేశారు. నిర్మాణ బలాన్ని రెట్టింపు చేయడంతోపాటు కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేయడం ఈ కాంక్రీట్ ప్రత్యేకత. ఆహార వ్యర్థాలు కుళ్లిపోతే కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది.
ఆ వ్యర్థాలతోపాటు బ్యాక్టీరియాను కాంక్రీట్‌లో కలిపితే అందులో ఉండే కాల్షియం అయాన్లతో కార్బన్ డయాక్సైడ్ చర్య జరిపి కాల్షియం కార్బొనేట్ స్ఫటికాలను ఏర్పరుస్తుందని ఇండోర్ ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సందీప్ చౌదరి వెల్లడించారు. ఈ స్ఫటికాలు కాంక్రీట్‌లోని రంధ్రాలు, పగుళ్లను పూడ్చేస్తాయని, తద్వారా ఆ కాంక్రీట్ బరువుపై పెద్దగా ప్రభావమేమీ చూపదని, పైగా దాని దృఢత్వాన్ని బాగా పెంచుతాయని ఆయన వివరించారు.