NEET-UG 2024: నీట్ కౌన్సెలింగ్‌పై స్టే నిరాకరించిన సుప్రీంకోర్టు
1,500 మందికి కావాలంటే మళ్లీ పరీక్ష;
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తోపాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నీట్ కౌన్సెలింగ్‌ను ఆపేది లేదని.. కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు పంపింది. ‘‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపబోం. పరీక్ష పూర్తైంది కాబట్టి మిగతాది అంతా సజావుగా సాగుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు’’ అని వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరోవైపు వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది. అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న 1,563 మంది ఫలితాలను నిలిపివేశామని, వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష విధిస్తామని.. ఆ తర్వాతే వాళ్లకు కౌన్సెలింగ్ ఉంటుందని ఎన్టీఏ కోర్టుకు నివేదించింది.