Chandrababu: ప్రజా ప్రతినిధులే వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు
వినుకొండ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడులను తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపితే వైసీపీ నేతలు వారిని రెచ్చగొట్టడమే కాకుండా దాడులు చేయడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తీరు కారణంగా శాంతి భద్రతల సమస్య వస్తుంటే నివారించాల్సిన పోలీసులు తిరిగి టీడీపీ కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనడానికి వినుకొండ ఘటనే నిదర్శనమన్నారు చంద్రబాబు. వైసీపీ చిల్లర వేషాలకు టీడీపీ కార్యకర్తలు భయపడరని చెప్పారు. ఖాకీ దుస్తులు వేసుకున్న ఏ స్థాయి పోలీసు అధికారులు అయినా వాటి విలువ తగ్గకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల రౌడీయిజం పై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.