Skype: మూసివేత దిశగా స్కైప్.. 5న వీడ్కోలు..
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం;
ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వీడియో-కాలింగ్ ప్లాట్‌ఫామ్ ‘స్కైప్’ సేవలు ఈ నెల 5 నుంచి నిలిచిపోనున్నాయి. స్కైప్‌కు వీడ్కోలు (ఫేర్‌వెల్) పలుకుతున్నామని, మే 5 తర్వాత యూజర్లకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉండదని మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. దీనిని వాడుతున్న యూజర్లు ‘టీమ్స్’కు మారాల్సి ఉంటుందని తెలిపింది.
స్కైప్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ సేవల్ని 2003లో తొలుత ప్రారంభించింది. అప్పట్నుంచీ దాదాపు 2 దశాబ్దాలుగా పాపులర్ ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది. దీనిని 2011లో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి స్కైప్ అంతర్గతంగా పోటీ ఎదుర్కొంటున్నది. ఆధునిక సమాచారం, సహకార వ్యవస్థకు ప్రైమరీ హబ్‌గా ‘మైక్రోసాఫ్ట్ టీమ్స్’ను నిలుపబోతున్నట్టు సంస్థ ప్రకటించింది. తమ యూజర్ల కమ్యునికేషన్ టూల్స్ అన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ‘స్కైప్’కు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపింది.