IPL: పూరన్... విధ్వంసం సృష్టించెన్

హైదరాబాద్‌పై లఖ్‌నవూ ఘన విజయం... తొలి విజయం సాధించిన లఖ్‌నవూ;

Update: 2025-03-28 01:30 GMT

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన లఖ్‌నవూ విజయ కేతనం ఎగరేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వెళ్లి ఓడిన లఖ్‌నవూ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో మాత్రం సాధికార విజయం సాధించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన ససన్‌రైజర్స్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. లఖ్‌నవూ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4/34) రాణించడంతో హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. 191 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ సునాయసంగా ఛేదించింది. 16.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి తొలి విజయాన్ని నమోదు చేసింది.

షాక్ ఇచ్చిన శార్దూల్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ను శార్దూల్ దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ వేసిన శార్దూల్ ఠాకూర్ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ను గట్టిదెబ్బ కొట్టాడు. తొలుత అభిషేక్ శర్మ (6)ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత బంతికే ఇషాన్ కిషన్ (0)ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్‌ కిషన్‌ ఎదుర్కొన్న తొలి బంతికే పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. రెండు వికెట్లు పడ్డా ట్రావిస్ హెడ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47 పరుగులు చేసి హెడ్ అవుటయ్యాడు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన అనికేత్ వర్మ 13 బంతుల్లో 36 పరుగులు చేశాడు. నితీశ్‌ రెడ్డి (32; 28 బంతుల్లో), హెన్రిచ్ క్లాసెన్ (26; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేశారు. పాట్ కమిన్స్ (18; 4 బంతుల్లో) హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాది ఔటయ్యాడు.

విధ్వంసం సృష్టించిన పూరన్

191 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ సునాయసంగా ఛేదించింది. 16.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి తొలి విజయాన్ని నమోదు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ నికోలస్‌ పూరన్‌ (70; 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరోసారి ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. ఓపెనర్ మిచెల్‌ మార్ష్‌ (52; 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా చెలరేగాడు. వీరిద్దరు దూకుడుగా ఆడటంతో 191 పరుగుల లక్ష్యం సునాయసమైపోయింది.హైదరాబాద్‌ బౌలర్లలో కమిన్స్‌ 2, మహ్మద్‌ షమి, ఆడమ్ జంపా, హర్షల్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

Tags:    

Similar News