ASIA CUP: ఆసియా కప్‌లో షేక్ ఆడిస్తున్న అభిషేక్
పాక్‌పై విధ్వంస బ్యాటింగ్‌తో సంచలనం...రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్న బ్యాటర్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఫీయర్ లెస్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న అభిషేక్.. ఆసియా కప్‌లో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా పాక్ పేసర్ షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో ఈ ఆసియా కప్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ బౌండరీలతోనే ఇన్నింగ్స్‌ని ఆరంభించాడు. గ్రూప్ మ్యాచ్‌లో ఫోర్‌తో ఖాతా తెరిచిన అభిషేక్, సూపర్ 4లో సిక్సర్‌తో ఆట మొదలుపెట్టాడు. టీ20ల్లో తక్కువ బాల్స్‌లో 50 సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కేవలం 331 బంతుల్లోనే 50 సిక్సులు బాదిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఆ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు ఈవిన్ లూయిస్ పేరుపై ఉన్నది. అతడు 366 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మూడో స్థానంలో అడ్రే రస్సెల్ ఉండగా, హజ్రతుల్లా జాజై (అఫ్గానిస్థాన్), టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 350 బంతుల్లో 50 సిక్సులు కొట్టిన వారి జాబితాలో నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు.
పాక్ కవ్వింపు నచ్చలేదు: అభిషేక్
పాకిస్థాన్ ఆటగాళ్ల కవ్వింపులు తనకు నచ్చలేదని, దాంతోనే వారిపై విరుచుకుపడ్డానని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. కారణం లేకుండా తమ దగ్గరకు వచ్చి వాగ్వాదానికి దిగడం తనకు కోపం తెప్పించిందని, బ్యాట్‌తోనే వారికి బదులిచ్చాని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. జట్టు కోసం గెలవాలనుకున్నాను. శుభ్‌మన్ గిల్‌తో కలిసి స్కూల్ రోజుల నుంచి ఆడుతున్నా. కలిసి ఆడటం ఇద్దరికీ ఇష్టమే. ఈ రోజు జోడీగా మా సత్తా చూపించాలనుకున్నాం. నేను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ఒకవేళ అది నా రోజు అయితే.. నా జట్టుకు విజయాన్ని అందిస్తాను.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
అభిషేక్ శర్మకు సెహ్వాగ్ కీలక సూచన
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒకప్పుడు తనకు చెప్పిన మాటలనే, ఇప్పుడు యువ సంచలనం అభిషేక్ శర్మకు గుర్తుచేశాడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. పాకిస్థాన్‌పై అభిషేక్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ అనంతరం, అతనికి సెంచరీలు చేయడంపై ఓ విలువైన సలహా ఇచ్చారు. తనను సెహ్వాగ్‌తో పోల్చడంపై అభిషేక్ వినమ్రంగా స్పందించాడు. మీ కాలంలోని పాకిస్థాన్ బౌలర్లు చాలా కఠినమైన వారని, అలాంటి బౌలింగ్‌ను కూడా మీరు ఉతికి ఆరేశారని ప్రశంసించాడు. ప్రస్తుత పాక్ బౌలింగ్‌లో అంత పస లేదని అభిప్రాయపడ్డాడు. "నువ్వు 70 లేదా 80 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు, సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ఇదే మాట నాకు సునీల్ గవాస్కర్ చెప్పారు. రిటైర్ అయ్యాక, ఇలా చేజారిన ఇన్నింగ్స్‌లు గుర్తుకొచ్చి బాధపడతాం. అరె, అప్పుడు సెంచరీ చేసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అందుకే, నీదైన రోజున నాటౌట్‌గా నిలిచి, భారీ స్కోరు సాధించాలి" అని సెహ్వాగ్ హితవు పలికాడు. అభిషేక్ తన అర్ధ శతకం కేవలం 24 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇది పాకిస్థాన్‌పై భారత ఆటగాడు చేసిన ఫాస్టెస్ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో తన మెంటార్ యువరాజ్ సింగ్ 29 బంతుల్లోనే చేసిన హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించడం విశేషం. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఆడిన అభిషేక్ శర్మ ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 74 పరుగులు చేసి అవుటయ్యాడు.