ASIA CUP: దాయాదుల సమరం చుట్టూ సంవాదం
భారత్-పాక్ మ్యాచ్ చుట్టూ వివాదాలు.. మ్యాచ్ నిషేధించాలంటూ డిమాండ్లు.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 14న భారత్-పాక్ మ్యాచ్
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమైంది. భారత్ తొలి మ్యాచులో ఘన విజయం కూడా సాధించేసింది. యూఏఈను చిత్తుచిత్తుగా ఓడించి తదపురి సమరానికి భారత జట్టు సిద్ధమైంది. భారత్ తన తర్వాతి మ్యాచ్ దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ మ్యాచ్ గురించి చాలా సందేహాలు తలెత్తాయి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్‌తో అన్ని సంబంధాలు తెంపుకున్న భారత్... ఇప్పుడు దాయాదితో క్రికెట్ మ్యాచుకు సిద్ధం కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఆగ్రహించిన సుప్రీం
ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. ‘అంత అత్యవసరం ఏమిటి? అది కేవలం ఒక మ్యాచ్. అలా జరగనివ్వండి. మ్యాచ్ ఆదివారం ఉంది. ఏం చేయాలి?’ అని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది. ఆదివారం మ్యాచ్ ఉందని, శుక్రవారం జాబితాలో చేర్చకపోతే పిటిషన్ నిష్ఫలమవుతుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఉర్వశి జైన్ తో పాటు నలుగురు న్యాయ విద్యార్థులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ప్రజల భావాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.
బీసీసీఐ ఏమన్నదంటే..?
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను రద్దు చేయాలని లేదా బహిష్కరించాలని పిలుపునివ్వడం ఇది మొదటిసారి కాదు. అయితే, బీసీసీఐ తన వైఖరిని స్పష్టం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. కేంద్రం బహుళ-దేశాల టోర్నమెంట్లలో పాల్గొనడానికి అనుమతిస్తుంది కానీ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను మాత్రం పరిమితం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవల మాట్లాడుతూ.. బహుళ-దేశాల టోర్నమెంట్లను బహిష్కరిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ లేదా ఐసీసీ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇది భారత ఆటగాళ్ల కెరీర్‌కు నష్టం చేకూరుస్తుందని అన్నారు.
ఈ చర్చకు అంతు లేదు
ఆసియా కప్ 2025 షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి భారత్-పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ అవసరమా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా పహల్గాం దాడి, దాని తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ వంటి సంఘటనల తర్వాత ఈ వివాదం మరింత పెరిగింది. పాకిస్తాన్‌ను క్రికెట్ ప్రపంచం నుంచి పూర్తిగా బహిష్కరించడం ఎందుకు సాధ్యం కాదో దేవ్ జీత్ సైకియా వివరించారు. బహుళ-జట్ల టోర్నమెంట్లలో పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరిస్తే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) లేదా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల బీసీసీఐపై నిషేధం పడే అవకాశం ఉంది. ఇది యువ క్రీడాకారుల భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.