ASIA CUP: మీరు గన్ పేలిస్తే.. మేం బ్రహ్మోస్‌తో ఇచ్చి పడేస్తాం
భారత్‌తో మ్యాచ్‌లో ఫర్హాన్ ఓవరాక్షన్... గన్ సెలబ్రేషన్స్‌పై సోషల్ మీడియాలో ఫైర్.. గన్ పేలిస్తే మేం బ్రహ్మోస్ వేస్తామంటూ ట్వీట్స్
ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా ఆదివారం నాడు భారత్ తో జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ ఫర్హాన్ తన హాఫ్ సెంచరీ తర్వాత చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. భారత అభిమానులను రెచ్చగొట్టేలా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా అతని ప్రవర్తన ఉందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత, బ్యాట్‌ను గన్ మాదిరిగా పట్టుకుని ఫైరింగ్ చేస్తున్నట్లు ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా నెటిజన్లు ఫర్హాన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సమయాల్లో గన్ ఫైరింగ్ సెలబ్రేషన్స్ అవసరమా అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు.
ఫర్షాన్ మ్యాచ్ మధ్యలో అలా ఏకే-47 కాల్చినట్లుగా సంజ్ఞలు చేయడంతో క్రీడాలోకం నివ్వెరపోయింది. మ్యాచ్ అనంతరం కూడా అతడు తన చేష్టలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అంతకు ముందు వరకు క్రీడాస్ఫూర్తి అంటూ ఉపన్యాసాలిస్తూ వచ్చిన పాకిస్థాన్.. ఇప్పుడేమో ఈ మ్యాచ్‌లో హింసాత్మక ప్రవృత్తికి అద్దం పట్టేలా ప్రవర్తించింది. ఫర్హాన్ చేసిన ఈ సెలబ్రేషన్స్ వెనుక పహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశించి ఉండవచ్చని చాలామంది భావిస్తున్నారు. అంతేకాదు, అతను భారత డగౌట్ వైపు చూస్తూ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మరింత వివాదానికి తెరలేపింది. ఈ చర్యను చూసిన క్రికెట్ అభిమానులు ఇది విద్వేషపూరితమైన చర్య అని, ఇలాంటి పనులు తగ్గించుకొని మ్యాచ్ ఎలా గెలవాలి అనే దానిపై దృషి పెడితే మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.
బ్రహ్మోస్ వేశారన్న పాక్ మాజీ ప్లేయర్
‘సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 కాల్చినట్లుగా సంజ్ఞలు చేశాడు. కానీ, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వారి బ్యాటింగ్‌తో పాక్‌పై ఏకంగా బ్రహ్మోస్ క్షిపణినే ప్రయోగించారు. అభిషేక్ శర్మ అదనంగా ఫ్లైయింగ్ కిస్‌ను కూడా ఇచ్చాడు. టీమ్ఇండియా ఓపెనర్ల వీర విధ్వంసానికి పాక్ క్రికెటర్లు చేతులెత్తేశారు. పాక్ చర్యకు, భారత్ ప్రతిచర్య భారీ స్థాయిలో ఉంది’ అని డానిష్ కనేరియా అన్నాడు. అలాగే అభిషేక్, గిల్ నైపుణ్యాన్ని అతడు కొనియాడాడు. ‘అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లాంటి ఓపెనర్లు జట్టులో ఉంటే.. 200 పరుగుల లక్ష్యం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎంతైనా వారిద్దరూ క్లాస్ ప్లేయర్లు’ అని డానిష్ కనేరియా విశ్లేషించాడు. ఫకర్ జమాన్ ఔట్‌పై కూడా.. కనేరియా స్పందించాడు. ‘ఇప్పుడు పాకిస్థాన్ మరో వివాదం కోసం చూస్తుంది. ఫకర్ జమాన్ ఔట్ రూపంలో వారికి అది దొరికింది. అది ఔట్ కాదని వారు వాదిస్తారు. కానీ, అది కచ్చితంగా ఔటే. సంజు శాంసన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ సమయంలో అతడి గ్లౌజులు బంతి కిందే ఉన్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ప్రకారం అది ఔట్ కాదంటూ వితండ వాదం చేస్తుంది’ అని కనేరియా తన సొంత జట్టునే దుయ్యబట్టాడు. రాజకీయాలు, క్రీడలు పూర్తిగా వేరుగా ఉండాలని పాకిస్థాన్, ఆ దేశ మాజీ ఆటగాళ్లు చాలా మంది చెబుతున్నప్పటికీ.. హారిస్ రవూఫ్ వంటి ఆటగాళ్ల ప్రవర్తన చూస్తే సరిహద్దు అవతల క్రికెటర్లు నిజంగా ఏం భావిస్తున్నారో అర్థమవుతోంది. ఇకపోతే ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ మరోసారి ఓడిపోయింది.