ASIA CUP: ఒక్క స్థానం.. నలుగురి పోటీ
సెలెక్టర్లకు తలనొప్పిగా భారత జట్టు ఎంపిక... ఒక్కో స్థానానికి నలుగురు పోటీ... గిల్‌కు చోటు దక్కుతుందా లేదా అన్న ప్రశ్న;
ఆసియా కప్ 2025కు భారత జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఆటగాళ్లు, ఐపీఎల్ స్టార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవర్ని ఎంపిక చేయాలి? మరెవర్ని పక్కనపెట్టాలనే విషయాన్ని అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ తేల్చుకోలేకపోతుంది. ఒక్కో ప్లేస్‌కు ముగ్గురు నుంచి నలుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా బ్యాటర్‌గా దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్.. గతేడాదిగా టీమిండియా టీ20 జట్టులో లేడు. ఐపీఎల్ 2025 సీజన్‌తో పాటు ఇంగ్లండ్ గడ్డపై మెరుగైన ప్రదర్శనతో శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని తీసుకోవాలా? లేదా? అనే విషయంపై అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. అతనితో పాటు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌ల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అయ్యర్, జురెల్‌కు చోటు
ఆసియాకప్ భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ కప్‌లో ఆడే జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం ఎంపిక చేయనుంది. గతేడాది జులైలో కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్, జితేశ్ టీ20 జట్టులోకి రాలేదు. డిసెంబర్ 2023లో శ్రేయస్ చివరిగా పొట్టి ఫార్మాట్లో కనబడగా.. గతేడాది జనవరిలో జితేశ్ ఆఖరిగా ఆడాడు. ఈ సీజన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంలో జితేశ్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ధ్రువ్ జురెల్ స్థానంలో అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంజు శాంసన్ రూపంలో ప్రధాన వికెట్‌కీపర్ టీ20 జట్టులో ఉన్నాడు. పని భార నిర్వహణలో భాగంగా ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో మూడు టెస్టులే ఆడిన పేసర్ బుమ్రా ఆసియాకప్ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేస్తారా లేదా అన్నది ఆసక్తికరం. మహ్మద్ షమి గాయంతో అందుబాటులో లేకపోవడంతో ఒక పేసర్ స్థానం ఖాళీగానే ఉంది.
నేడే జట్టు ప్రకటన..?
ముంబై వేదికగా ఆసియా కప్ బరిలోకి దిగే భారత జట్టును సెలెక్షన్ కమిటీని నేడు ప్రకటించే అవకాశం ఉంది. 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం 15వ ఆటగాడి ప్లేస్ కోసం శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. కెప్టెన్‌గా బ్యాటర్‌గా సత్తా చాటి 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దాంతో అయ్యర్‌ను తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకోవాలంటే అనుభవం కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉండాలనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు రింకూ సింగ్ ఫినిషర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు. ఫిట్నెస్ను అంచనా వేసిన తర్వాతే బుమ్రాపై సెలక్టర్లు నిర్ణయం ప్రకటించొచ్చు. ఐపీఎల్-18లో సత్తా చాటిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా రేసులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అనూహ్యమైన ప్రదర్శన చేసిన శుభ్‌మన్ గిల్‌కు టీ20 జట్టులో స్థానం లభిస్తుందో లేదో స్పష్టత లేదు.