AUS vs IND: శివంగుల విధ్వంసంలో ఆస్ట్రేలియాదే గెలుపు
మూడో వన్డేలో భారత్‌పై ఆసీస్ గెలుపు... చివరి వరకూ పోరాడి ఓడిన టీమిండియా... 412 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా... 369 పరుగులు చేసిన భారత మహిళల జట్టు
ఆస్ట్రేలియాతో హోరాహోరీగా జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచులో ఆస్ట్రేలియా- భారత్ బ్యాటర్లు చెలరేగిపోయారు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. బెత్ మూనీ (138; 75 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్స్) శతకానికితోడు ఇతర బ్యాటర్లూ రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ కొండంత లక్ష్యఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (125; 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు శతకం వృథా అయింది. దీప్తి శర్మ (72; 58 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (52; 35 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకాలు చేసినా భారత్‌కు ఓటమి తప్పలేదు.
ఊచకోత కోసిన మంధాన
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు స్మృతి మంధాన మెరుపు ఆరంభం ఇచ్చింది. మహిళల వన్డేల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియాపై 50 బంతుల్లో 101 చేసింది. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. మొత్తం 63 బంతులు ఎదుర్కొన్న స్మృతి 125 పరుగులు చేశారు. ఇందులో 17 ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. అంతేకాకుండా వరుసగా రెండు వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మంధాన నిలిచింది. . ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో మహిళల వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన మంధాన 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు వన్డేల్లో (పురుషుల, మహిళల క్రికెట్) వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ (52 బంతుల్లో) ఉండేవాడు. ఇప్పుడా రికార్డును మంధాన బద్దలు కొట్టింది. కోహ్లీ కూడా ఆస్ట్రేలియాపైనే (2013లో) ఈ ఘనత సాధించడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్‌మూనీ అంతకుముందు విధ్వంసం సృష్టించింది. నాలుగో స్థానంలో వచ్చిన బెత్ మూనీ (138; 75 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీల వర్షం కురిపించింది. ఈమె 57 బంతుల్లోనే సెంచరీ చేసిందంటే ఏ స్థాయిలో చెలరేగి ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే బెత్ మూనీ మహిళల వన్డే క్రికెట్లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేసింది.