జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే నెల 12న ఈ పదవితోపాటు ట్రెజరర్‌ను బీసీసీఐ నియమించనుంది. ఈ పదవి కోసం దేవజిత్ సైకియా, అనిల్ పటేల్, రోహన్ జైట్లీతోపాటు మరికొందరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అస్సాంకు చెందిన సైకియా బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, కోశాధికారి స్థానం ఖాళీగా ఉంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. రాజీనామా చేసిన కార్యవర్గ సభ్యుల స్థానంలో కొత్త వాళ్లను 45 రోజుల్లోపు ఎన్నుకోవాలి. ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల అధికారిని నియమించాలి. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, కార్యదర్శితోపాటు కోశాధికారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.